Leading News Portal in Telugu

Nara Lokesh Delhi Tour: ఢిల్లీకి నారా లోకేష్‌.. విషయం ఇదేనా..?


Nara Lokesh Delhi Tour: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కాకరేపుతోంది.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో స్కామ్‌కు పాల్పడ్డారు.. ఇవిగో ఆధారాలు అని చూపిస్తున్నారు. అయితే, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్‌ చేసేలా పావులు కదుపుతోంది ఆ పార్టీ.. దాని కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢిల్లీ బాట పట్టారు.. రాజమండ్రి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియాతో మాట్లాడనున్నారట లోకేష్‌.. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ఢిల్లీ టూర్‌గా తెలుస్తోంది.

తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుపై కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్‌ చర్చించనున్నారని సమాచారం.. పార్లమెంటులో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం సిద్ధం చేసిందట.. చంద్రబాబు అరెస్టుపై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేష్ మాట్లాడనున్నారట. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన నారా లోకేష్ వెంట.. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మరో ముగ్గురు కూడా ఉన్నారు.. చంద్రబాబు అరెస్టు, ఆ కేసుపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.. కేంద్ర పెద్దల అపాయింట్‌మెంటగ్‌ కోరారని.. అవకాశం లభిస్తే కలుస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి..

ఇక, 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని రాజమండ్రిలో నారా లోకేష్‌ ప్రకటించిన విషయం విదితమే.. పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణతో కలిసి వెళ్లి ములాఖత్‌లో తన తండ్రి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలులో కలిసిన ఆయన.. ఆ తర్వాత.. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నాం.. రెండు పార్టీల నుంచి కమిటీ వేసి పోరాటాలపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి అవసరం రాష్ట్రానికి ఉందని.. దాని కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. బీజేపీ వస్తారో రారో వాళ్లు తేల్చుకోవాలని సూచించారు నారా లోకేష్‌.