Kottu Satyanarayana: టీడీపీ-జనసేన పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.. ఇక, పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. చంద్రబాబుతో కలసి వెళ్తాననంటున్న పవన్‌కు దీని పర్యవసానం త్వరలోనే చూస్తారని హెచ్చరించారు. పవన్ ప్రకటనతో ప్యాకేజీ స్టార్ అని చెప్తున్న విషయం నిజమైందన్న ఆయన.. పవన్ కల్యాణ్‌ను ప్రజల్లో, సమాజంలో.. డబ్బు కోసం ప్యాకేజీ కోసం పనిచేసే వ్యక్తిగా ప్రచారం చేసింది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. కాపు నాయకులు వంగవీటి రంగాను చంపింది చంద్రబాబు కాదా.. ముద్రగడ కుటుంబాన్ని అవమానించింది చంద్రబాబు కాదా..? చిరంజీవిని అవమానించింది చంద్రబాబు కాదా..? కాపులకు ఇంత ద్రోహం చేసిన వ్యక్తితో కలవడం ఏంటని కాపు సామాజిక వర్గం మొత్తం లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం కాపులను తలదించుకునేలా చేస్తుందన్నారు మంత్రి కొట్టు.. కాపు వ్యతిరేకి చంద్రబాబు మద్దతు ఇవ్వడం, తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవడమే అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.. ఇక, పవన్ కల్యాణ్ ఉంటే షూటింగ్ లో.. లేకపోతే చంద్రబాబు కాళ్ల దగ్గర ఉంటాడు.. సంతోషంగా ఉన్న ప్రజలను కష్టాలు పడాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన ఆయన.. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని ప్రకటించారు పవన్.. ఇదే సమయంలో.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని తన కోరిక అని పేర్కొన్న విషయం విదితమే.