AP High Court: కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన ఇంటిని అక్రమంగా కూల్చారని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు కడపకు చెందిన పద్మావతి బాయి.. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పిటిషనర్ ఇంటిని కూల్చివేసి రోడ్డు వేశారని పిటిషనర్ వాదన.. అయితే, అధికారులు తప్పు చేశారని నిర్ధారణ కావడంతో నెల రోజులు జైలు శిక్షతో పాటు 15 వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు..
మరోవైపు.. విజయవాడ మున్సిపల్ కమిషనర్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. విజయవాడలో తన స్థలంలో తప్పుడు సర్వే నంబర్ తో ఎలైట్ ఎలక్స్ అపార్ట్ మెంట్ ను నిర్మించారని కోర్టులో పిటిషన్ వేశారు సూర్య కిరణ్ అనే వ్యక్తి.. అక్రమంగా నిర్మించిన ఈ అపార్ట్మెంట్ ను కూల్చివేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. మున్సిపల్ కమిషనర్, డీటీడీపీ డైరెక్టర్, సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ లకు నోటీసులు జారీ చేసింది.. అంతేకాకుండా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన 60 మందికి కూడా ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.