Janasena: 2024 ఎన్నికల్లో జనసేన బలమైన స్థానాలకో ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతోందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవర్ షేరింగు తీసుకునే జనసేన వెళ్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టిన రోజున ఏపీ చరిత్ర మార్చేస్తుందన్నారు. “పార్లమెంటులో జనసేన అడుగుపెట్టబోతోంది. తెలుగుదేశంతో ఎలా అధికారం పంచుకుందాం..? అది సీఎం స్థానమా..? లేక మంత్రులా..? ఇవన్నీ ఆలోచించే ముందు మనం గెలవాలి కదా..? మనం గెలిస్తేనే అధికారంలో భాగస్వామ్యం కాగలం. పగటి కలలు కనొద్దు.. ముందు జగన్ను రాష్ట్రం నుంచి తరిమేయాలి. జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమేశాక పవర్ షేరింగ్ గురించి ఆలోచిద్దాం.” అని ఆయన పేర్కొన్నారు. టీడీపీతో సమన్వయం చేసుకునే బాధ్యత నాదెండ్లకు అప్పజెబుతున్నామన్నారు జనసేనాని పవన్. సమన్వయ కమిటీ అధ్యక్షునిగా నాదెండ్ల మనోహర్‌ను నియమిస్తుమన్నారు. జనసేన ఎన్డీఏలోనే ఉందన్నారు. మనం బీజేపీతోనే ఉన్నాం.. ఈ విషయం చాలా గట్టిగా చెప్పాలని జనసైనికులకు సూచించారు.
“2009 నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు.. 2024లో సాకారం కాబోతోంది. సింహం సింగిల్ అంటూ తొడలు కొడుతున్నారు.. తొడలు వాస్తాయి. అధికారులు ఆలోచించుకోవాలి.. ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తోంది. మేం విసిగిపోయాం.. గొడవే కావాలంటే మేమూ సిద్దమే. రాబోయే జనసేన-టీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి మద్దతివ్వాలి. తెలంగాణలో మనం పోటీ చేయాలి. ఎలా పోటీ చేయాలి.. ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది ఆలోచిద్దాం.” అని పవన్ అన్నారు.
ప్రధానిని.. అమిత్ షాను ఉద్దేశించి సమావేశం చివర్లో ఇంగ్లిషులో ప్రసంగించిన పవన్.
జీ-20 సదస్సు సక్సెస్ అయినందుకు ప్రధాని మోడీకి పవన్ అభినందనలు తెలిపారు. భారత్ ప్రధానిగా మోడీని మళ్లీ చూడాలనుకుంటున్నామన్నారు. మేం ఎన్డీఏతోనే ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే మా ఎంపీలంతా ఎన్డీఏలోనే ఉంటారు.. ఇది నా ప్రామిస్ అంటూ పవన్ పేర్కొన్నారు. ఏపీకి మోడీ, అమిత్ షా ఆశీస్సులు కావాలన్నారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఏపీ రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేలా కేంద్రం సహకారం అవసరమన్నారు. మూడు రాజధానులు కాకుండా.. మూడు ప్రాంతాల అద్భుత అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్నారు.