CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు.. నిడదవోలులో నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకోనున్న ఆయన.. సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైఎస్సార్ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.. అయితే.. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఈ రోజు సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. లండన్ పర్యటన తర్వాత మొదటిసారి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
నిడదవోలు వేదికగా తాజా రాజకీయ పరిణామాలపై సీఎం వైఎస్ జగన్ స్పందించే అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నో కీలక పరిణామాలు జరిగాయి.. ఆయన రాష్ట్రానికి చేరుకున్న తర్వాత కూడా ఆ హీట్ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రచ్చగా మారింది.. కక్ష పూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. వైసీపీ నేతలు వాటికి ఎప్పటికప్పుడూ కౌంటర్ ఇస్తూనే ఉన్నా.. సీఎం జగన్ ఇప్పటి వరకు ఆ వ్యవహారంపై స్పందించలేదు.. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన -టీడీపీ పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన మరింత పొలిటికల్ హీట్ పెంచింది.. అయితే, నిన్నటి విజయనగరం జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో రాజకీయ విమర్శలు లేకుండా సీఎం వైఎస్ జగన్ ప్రసంగం సాగింది.. కానీ, నేటి నిడదవోలు పర్యటనలో తాజా పరిణామాలపై సీఎం జగన్ స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.. దీంతో.. ఇవాళ్టి సీఎం జగన్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది.
ఓవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన విధానం, చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే పరిణామలపై సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది.. మరోవైపు ఇప్పటికే టీడీపీ-జనసేనపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న వైసీపీ అధినేత.. పొత్తుపై పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన చేసిన తర్వాత మాత్రం స్పందించింది లేదు.. దీంతో.. ఆ పొత్తుపై ఎలాంటి కామెంట్లు చేస్తారనేది కూడా చర్చగా మారింది.. ఏదేమైనా.. సీఎం వైఎస్ జగన్ స్పీచ్‌తో ఏపీలో మరింత పొలిటికల్ హీట్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక, నేడు నిడదవోలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. సీఎం జగన్ నిడదవోలు పర్యటన సందర్బంగా పలు ప్రైవేట్ స్కూల్ లకు సెలవు ప్రకటించినట్టుగా తెలుస్తోంది.. నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి ప్రాంతాలకి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు లను ప్రజలని నిడదవోలు తరలించేందుకు ఏర్పాటు నేపథ్యంలో పలు విద్య సంస్థలు సెలవు ప్రకటించాయట..