Gidugu Rudraraju: ఢిల్లీలో జరిగిన విస్తృత స్థాయి “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” (సీడబ్ల్యూసీ) సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీలో అమలు కాని 10 కేంద్ర ప్రభుత్వ హామీలను గురించి తెలిపారు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్ట్, ఆర్థిక తోడ్పాటు హామీలను మోడీ ప్రభుత్వం విస్మరించిందని రుద్రరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఏపీ
పార్టీ నేతలు, కార్యకర్తలు విపరూతంగా శ్రమిస్తున్నారని తెలిపారు.
గత అక్టోబర్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన చారిత్రాత్మక “భారత్ జోడో” యాత్రకు ఏపీలో ప్రజల నుంచి బ్రహ్మాండమైన ప్రతిస్పందన లభించిందని గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ నేపధ్యంలో సీనియర్ నాయకులు తరచూ ఏపీలో పర్యటించి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను పునరుత్తేజం చేయాలని కోరారు. ఏపీలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రతిపాదించారు రుద్రరాజు. సాధ్యమైనంత త్వరగా ఏపీలో బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని అభ్యర్ధించారు. విశాఖపట్నంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా.. విజయవాడ-అమరావతిలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ప్రతిపాదన తెలిపారు. తిరుపతి లేదా అనంతపురంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో తెలియజేశారు.