Ganesh Chaturthi : సాగర నగరం విశాఖలో వినాయక చవితి శోభ సంతరించుకుంది.. దేశంలో ఎన్ని వినాయక పూజలు జరుగుతున్న ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే ఉంది.. కారణం పూర్తి మట్టితో చేసిన 117 అడుగుల భారీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు.. అద్భుతమైన రూపంతో భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నాడు.. గాజువాక లంకా మైదానంలో ఈసారి అనంత పంచముఖ మహాగణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.. తెలంగాణకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు కొత్తకొండ నగేష్ పర్యవేక్షణలో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 26 మంది కళాకారులు ఈ విగ్రహన్ని తయారీ చేశారు.. 117 అడుగుల ఎత్తయిన వినాయక విగ్రహం తయారీ కోసం 120 అడుగుల ఎత్తు, 39 అడుగుల వెడల్పుతో మండపాన్ని రూపొందించారు.
పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించినట్టు ఉత్సవ నిర్వాహకుడు గణేష్ తెలిపారు. విగ్రహ తయారీ కోసం గడ్డి, చెరువు మట్టి, కోల్‌కతా నుంచి గంగానది మట్టిని ఉపయోగించారు. గణపతి విగ్రహానికి ఆనుకుని 35 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తయిన అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని రూపొందించారు. అనకాపల్లికి చెందిన ఆరిపాక కృష్ణ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. మండపంలోకి వెళ్లగానే తొలుత అందరికీ కనిపించే విధంగా సింహాద్రి అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మండపం వద్ద యాగశాల నిర్మించారు. ఈసారి రికార్డు సాధించడం కోసం లక్ష మంది భక్తులతో వినాయక కోటి నామాల పుస్తకాలు రాయిస్తున్నారు. ఈ పుస్తకాలను కాణిపాకం వినాయక ఆలయానికి అప్పగిస్తామని నిర్వహకులు అంటున్నారు.. ఈ విగ్రహాల తయారీకి 8 టన్నుల మట్టి, 5 టన్నుల వెదురు, 20 టన్నుల ఐరన్ ఉపయోగించినట్టు తెలిపారు.