Leading News Portal in Telugu

Andhra Pradesh Crime: ప్రాణం తీసిన చపాతీ గొడవ.. సుత్తితో కొట్టి చంపేశాడు..


Andhra Pradesh Crime: చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నారు.. నన్ను అవమానించారని ఒకరు.. హేళన చేశారని మరొకరు ఇలా క్షణికావేశంతో దారుణాలకు పాల్పడుతున్నారు.. చపాతీ విషయంలో జరిగిన ఓ గొడవ చివరికి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామం వద్ద గ్రానైట్ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన లక్కీరామ్ ముర్మా, సతీష్ నిద్రిస్తున్న సమయంలో.. వారితో సుత్తితో దాడి చేశారు బావర్ సింగ్ అనే వ్యక్తి.. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సతీష్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.. అసలు ఎందుకు దాడి చేశాడనే వివరాల్లోకి వెళ్తే.. గ్రానైట్ ఫ్యాక్టరీలో చేసే పని తక్కువ నువ్వు చపాతీలు తినేది ఎక్కువ.. అంటూ భావర్ సింగ్ తో గొడవపడిన సమయంలో లక్కీ రామ్ ముర్మా, సతీష్ హేళన చేశారట.. అయితే, అది మనసులో పెట్టుకున్న బావర్‌ సింగ్.. లక్కీరామ్‌ ముర్మా, సతీష్ నిద్రిస్తున్న సమయంలో దాడి చేశాడు.. ఈ ఘటనలో సతీష్‌ అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తుండగా.. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మొత్తంగా చపాతీ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసేంత వరకు వెళ్లడం కలకలం సృష్టిస్తోంది.