విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన నిర్ణయం అభివృద్ధికి సూచిక అంటూ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశాఖ పరిపాలన రాజధాని అంటున్నారు.. అదే చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. దశల వారీగా వివిధ విభాగాల తరలింపు జరుగుతుంది.. శాసన, న్యాయ రాజధాని అమరావతిలోనే ఉంది.. విశాఖ నుంచే ఇక వైసీపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు కొనసాగవుతాయి.. అందుకు తగ్గట్టుగానే ఆఫీసు నిర్మాణం జరిగింది అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది అని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఖాయం.. ఇప్పటికే విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయి.. సీఎం జగన్ రాకతో ఆ పెట్టుబడులు మరింత పెరుగుతాయని ఆయన వెల్లడించారు. విశాఖ నుంచి ఏపీ పరిపాలన కొనసాగుంది.. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన అన్నారు. అయితే, అంతకు ముందు సీఎం జగన్ మంత్రి మండలి సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. ఇక, అక్టోబర్ 23 అనగా విజయదశమి రోజు నుంచి విశాఖలోనే ఏపీ ప్రభుత్వం పరిపాలన చేయనుందని ప్రకటించారు. దీంతో సీఎం జగన్ చేసిన కామెంట్స్ తో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటికే విశాఖలో వైసీపీ పార్టీ ఆఫీస్ ను సైతం ఏర్పాటు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పార్టీ యొక్క కార్యక్రమాలు అన్ని అక్కడి నుంచే జరుగనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.