ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఇవాళ( బుధవారం ) కొనసాగుతుంది. ఉదయం విచారణ జరగ్గా.. దాన్ని మధ్యాహ్నానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇక వాయిదా అనంతరం తిరిగి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ అధికారులు చంద్రబాబును 5 రోజులు కస్టడీకి కోరారు. రూ. 371 దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందనే చంద్రబాబు కస్టడీని అడ్డుకుంటున్నారు అంటూ సీఐడీ తరపు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
అయితే, కస్టడీ పిటిషన్ తర్వాత మిగిలిన పిటిషన్లపై విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు క్లారిటీ ఇచ్చింది. అన్ని పిటిషన్లు ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావొద్దని ఏసీబీ న్యాయమూర్తి పేర్కొన్నారు. పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదని కోర్టు తెలిపింది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఫైబర్ గ్రిడ్ పీటీ వారంట్లపై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్ పై తొలుత విచారణ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశించింది. ఇక, హైకోర్టు ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకే వర్తిస్తాయి. దీంతో ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ తర్వాత విచారణ జరపాలని ఇరు వర్గాల లాయర్లు పేర్కొన్నారు.