Leading News Portal in Telugu

Purandeswari: జనసేన – బీజేపీ పొత్తు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి


Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. తాజాగా ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. ఇదే సమయంలో.. బీజేపీ మాతో కలిసి వస్తుందా? లేదా? అనే విషయం వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. మరోసారి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు అనేవి ఎన్నికలకు నెల ముందు నిర్మించబడతాయి.. ఆ విషయాన్ని కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నాను అని చెప్పారు.. మేం జనసేన తో పొత్తులో ఉన్నాం అన్నారు పురంధేశ్వరి.. అయితే, పవన్‌ కల్యాణ్‌.. తెలుగుదేశం పార్టీతో వెళ్లాలి అనే విషయం కేంద్రంతో చర్చిస్తా అన్నారు.. ఆ విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఏం జరిగిన బీజేపీకి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు.. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. చీప్‌ లిక్కర్‌ ద్వారా డబ్బు సంపాదించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సమంజసం కాదన్నారు. ఇక, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు తమదే అంటున్నారు. కానీ, ఆ బిల్లును అమలు చేయడానికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.