Leading News Portal in Telugu

AP Assembly Session: ఎక్కడ దొరికిపోతామని భయపడుతున్నారు.. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రండి


AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే అవకాశమున్న ఈ సమావేశాల్లో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం కాకపుట్టిస్తోంది. సమావేశాలకు టీడీపీతో పాటు అధికారంలో ఉన్న వైసీపీ కూడా ప్రిపేర్ అయి వచ్చినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే.. టీడీపీ చంద్రబాబు అరెస్టుపై చర్చ కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వాయిదా తీర్మానం ఇచ్చింది. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానానికి స్పీకర్ వెంటనే అనుమతించకపోవడంతో నిరసనకు దిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. సభా కార్యక్రమాలు జరుగాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు అరెస్టుపై చర్చకు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ వారి వారించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ సదరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తు్న్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో టీడీపీ సభ్యుల అడిగిన ప్రశ్నలకు మీడియా పాయింట్లో పలువురు వైసీపీ నేతలు సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబు అవినీతి పై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ నేతలు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. చంద్రబాబు తప్పు చేసింది వాస్తవం అవునా ..కాదా ? అంటూ ప్రశ్నించారు. ఎక్కడ దొరికిపోతామోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ కోరలేకపోతున్నారో ఆలోచించాలన్నారు.

స్పీకర్ పట్ల టీడీపీ నేతలు చాలా అమర్యాదగా వ్యవహరించారని ఎమ్మె్ల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నప్పటికీ చర్చ కొనసాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు వచ్చారన్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ పైనే మాట్లాడుతున్నారు.. దానిపై చర్చిద్దాం అంటే ఎందుకు పారిపోతున్నారో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారో తెలియడం లేదన్నారు. సమావేశాల్లోనే కచ్చితంగా చంద్రబాబు అవినీతి పై చర్చింది.. నిజనిజాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు.