Leading News Portal in Telugu

AP Skill development case: నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్‌..


AP Skill development case: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయన విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్‌ నేటితో ముగియనుంది.. దీంతో.. మరోసారి ఆయన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. మరోసారి విజయవాడకు తరలించకుండా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచే వీడియో కాలింగ్‌ ద్వారా వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు.. దీనికోసం రాజమండ్రి జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు..

మరోవైపు.. ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఆయనపై అభియోగాలు మోపిన సీఐడీ.. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం కస్టడీ కోసం ప్రయత్నాలు సాగిస్తోంది.. టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఏసీబీ కోర్టు మరోసారి వాయిదా వేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత తీర్పు శుక్రవారం వెల్లడిస్తానని పేర్కొన్నారు. అయితే, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఈ నెల 9వ తేదీన అరెస్ట్‌ అయిన చంద్రబాబుకు ఈ కేసులో ఇప్పటి వరకు జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే.. మరోసారి రిమాండ్‌ పొడిగింపునకు అవకాశం ఉందని.. చంద్రబాబుకు మరో 14 రోజుల పాటు రిమాండ్‌ విధించే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు.