Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో యాక్టివ్ అయిపోయారు.. గతంలో అవసరం అయినప్పుడు తప్పితే.. సభకు వచ్చారా? వెళ్లారా? అన్నట్టుగా ఉండే బాలయ్య.. తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత గేర్ మార్చేశారు.. సభలో నిరసన తెలుపుతున్నారు.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లే ఆందోళన చేస్తున్నారు.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు చేస్తున్నారు… అధికార పక్షానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు. విపక్ష నేతలు రెచ్చగొడితే మీసాలు మెలేసి కౌంటర్ ఇస్తున్నారు.. తొడగొట్టి వార్నింగ్ ఇస్తున్నారు.. అంతే కాదు.. ఈరోజు అసెంబ్లీలో విజిల్స్‌తో హోరెత్తించారు.. ఇలా మొత్తంగా టీడీపీ సభ్యుల ఆందోళన సమయంలో.. నందమూరి బాలకృష్ణ గురించే ఎక్కువ చర్చ సాగుతోంది.. టీడీపీ సభ్యులకు కౌంటర్ ఇస్తూ మాట్లాడుతున్న ప్రతీ మంత్రి, అధికార పార్టీకి చెందిన నేతలు.. బాలకృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడడం లేదు.
గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడు.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు అంటూ సెటైర్లు వేసిన మంత్రి అంబటి రాంబాబు.. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ.. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు.. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. జన్మనిచ్చిన తండ్రి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చిందన్నారు.. అంతేకాదు.. మీ బావ జైల్లో… అల్లుడు ఢిల్లీలో ఉన్నారు.. ఇదే మీకు సరైన సమయం .. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి అంటూ బాలకృష్ణకు సలహా ఇచ్చారు..
ఇక, బాలకృష్ణ రీల్ హీరో.. జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని అభివర్ణించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. రీల్ హీరోలు సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, అనుచితమైన ప్రవర్తనతో వ్యవహరించేవాడు అసలు నటుడే కాదు అంటూ బాలయ్యపై మండిపడ్డారు కాకాణి.. దేవాలయం వంటి అసెంబ్లీలో తాను చేసిన పనికి ఒక కళాకారుడిగా బాలకృష్ణ సిగ్గుపడాలన్న ఆయన.. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్.. మీరు నీతిమంతులైతే.. దమ్ము, ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం అని చాలెంజ్‌చేశారు. మొత్తంగా.. అసెంబ్లీలో.. మీడియా పాయింట్‌లో ఎక్కడా చూసినా నందమూరి బాలకృష్ణ గురించే చర్చ సాగుతోంది.