Leading News Portal in Telugu

Chandrababu Arrest: చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని 186 పేజీల కౌంటర్‌ దాఖలు


Chandrababu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఐడీ కౌంటర్‌ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని 186 పేజీల కౌంటర్‌ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. దర్యాప్తు వివరాలను, సేకరించిన ఆధారాలను కౌంటర్‌లో సీఐడీ పొందుపరిచింది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు ఎందుకు వర్తించదనే అంశాన్ని పిటిషన్‌లో సీఐడీ పొందుపరిచింది. చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కాంకు సెక్షన్ 409 వర్తిస్తుందని కౌంటర్‌లో వివరించింది.

ఇదిలా ఉండగా.. చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలు ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. శని, ఆదివారాలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.