ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలౌతుంటే ఆధారాలు లేని స్కాముల పేరుతో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. అర్థాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్దాలు పెట్టి చంద్రబాబు నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు.. రైతు ఆత్మహత్యలు, నిత్యావసర ధరలు, పన్నుల భారం, నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత ఇవేవీ జగన్ ప్రభుత్వానికి కనపడవా?.. అన్నీ వ్యవస్థలను గుప్పెట్లో సీఎం జగన్ పెట్టుకొన్నారు అంటూ యనమల అన్నారు.
అసెంబ్లీలో తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ హయాంలో ఏనాడు అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చ జరిగిన దాఖలాలు లేవు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధం ఉన్న నీలం సహాని, అజయ్ కల్లాం, ఐవైఆర్ కృష్ణారావులను ఎందుకు విచారించరు?.. సీఐడీ వారు అన్ని కోర్టులను అబద్ధపు వాదనలతో నమ్మించాలని చూస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం చందమామ కథలు చెబుతూ సీఐడీ అధికారుల చేత చిలుకపలుకులు పలికిస్తోంది అని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబుపై కావాలనే జగన్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాడని యనమల రామకృష్ణుడు ఆరోపించాడు. ఇలాంటి ధోరణి మార్చుకోవాలని ఆయన హెచ్చరించాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు రెడీ అవుతున్నారు.. వైసీపీ పాలనలో అభివృద్ది శూన్యం.. అందుకే జగన్ పై ప్రజలకు విసుగు వచ్చిందని యనమల విమర్శించారు.