Leading News Portal in Telugu

Lioness Dies Of Heart Attack: గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి


Lioness Dies Of Heart Attack: విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌లో 18 ఏళ్ల ఆడసింహం వృద్ధాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు ఆదివారం ఓ అధికారి తెలిపారు. ఆడసింహం మహేశ్వరి శనివారం అర్థరాత్రి మృతి చెందింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. వృద్ధాప్యం కారణంగా మరణానికి తీవ్రమైన మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌ (గుండెపోటు) కారణమని వైజాగ్ జూ క్యూరేటర్ నందనీ సలారియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

2006లో జన్మించిన ఈ ఆడసింహం మహేశ్వరిని.. 2019లో గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూపార్క్‌ నుండి వైజాగ్ జూ పార్క్‌కు తీసుకువచ్చారు. లక్షలాది మందికి ఆసియాటిక్ సింహాలపై విద్యను అందించి పరిరక్షణకు దోహదపడింది. సలారియా ప్రకారం, సింహాలు అడవిలో సుమారు 16 నుంచి 18 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అయితే ఆడసింహం మహేశ్వరి తన జీవితంలో 19వ సంవత్సరంలోకి ప్రవేశించగలిగింది.ఈ ఏడాది అరుదైన జంతువులు మృత్యువాత పడినట్లు జూ క్యూరేటర్ వెల్లడించారు. రెండు పులులు, ఒక జిరాఫీ, ఒక జీబ్రా మృతి చెందినట్లు చెప్పారు.