Leading News Portal in Telugu

Tomato Price: టమాటా రైతన్నల కంట కన్నీరు..


ఆరుగాలం శ్రమించి పండించి మార్కెట్‌కు తరలిస్తే ఇక్కడి వ్యాపారుల మాయాజాలంతో టమాటా రైతులు నిలువునా మునిగిపోతున్నారు. దీంతో టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పత్తికొండ మార్కెట్‌ యార్డు బయట పత్తికొండ-గుత్తి ప్రధాన రహదారిపై జనసేన-బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. ఇక, జనసేన-బీజేపీ నిరసనతో రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మార్కెట్‌యార్డు సిబ్బంది సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ధరల స్థిరీకరణకు కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమోటా 2 రూపాయలకు మించి అమ్ముడు పోవడం లేదని.. దీంతో పెట్టుబడుల మాట అటుంచి కోత కూలీలు, రవాణ చార్జీలు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. కిలో టమోటాను రూ.20 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టమోటా పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్‌లో ధర పతనమై తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయాల్లో ఆయా పార్టీలు హామీలు ఇవ్వడం.. ఆ తరువాత మరిచిపోవడం మామూలైపోయిందన్నారు. ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి టమోటా రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పత్తికొండ మార్కెట్ లో కిలో టమాటా ధర కేవలం రూ. 50 పైసలు పలుకుతుంది. దీంతో తమకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.