రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజల దృష్టి మరల్చుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కక్ష్య సాధింపులపై పెడుతున్న దృష్టి.. వ్యవసాయం, రైతాంగం సమస్యలపై దృష్టి పెట్టడం లేదని సత్యకుమార్ ఆరోపించారు. ఏడు సార్లు కరెంట్ చార్జీలు పెంచారు… కరెంట్ కోతలు పెరిగాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో నిత్యావసరాల ధరలు ఉన్నాయన్నారు సత్యకుమార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులానే… వైసీపీ ప్రభుత్వ బైజూస్ అవినీతి కూడా బయటకు వస్తుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ…జనాన్ని మోసం చేస్తున్నారని, ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్రంలో ప్రతి రోజు పోలీసు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు సత్యకుమార్. బైజూస్ లో అవినీతిపై బీజేపీ ఆధారాలు సేకరిస్తుందని, మహిళ అని చూడకుండా పురందేశ్వరిని విమర్శించడం సరైంది కాదని సత్యకుమార్ హితవు పలికారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వ్యవహరించిన తీరును బీజేపీ ఖండిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంలో రాష్ట్ర అంశాలపై జోక్యం చేసుకోదన్నారు. జగన్ బెయిల్ అంశం కేంద్రం ప్రభుత్వం పరిధిలోనిది కాదు… కోర్టు పరిధిలోని అంశమని, సీఎం జగన్ ను అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజుతో సత్యకుమార్ పోల్చారు. పొత్తులపై ఇప్పుడేమీ చెప్పలేం…జనవరిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సత్యకుమార్ వెల్లడించారు.