Leading News Portal in Telugu

Chandrababu Naidu News: నేడు సుప్రీంకోర్టు ముందుకు మాజీ సీఎం చంద్రబాబు పిటిషన్‌!


Nara Chandrababu Naidu Petition Today in Supreme Court: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ స్కామ్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె శ్రీనివాస రెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ.. చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు.

సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును నారా చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్‌ చేశారు. అత్యవసరత ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చాం, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారు, ఇది ఏపీకి సంబంధించిన కేసు, ఏపీలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ మంగళవారం రమ్మని సూచించారు. ఎప్పటి నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారూ లాంటి ప్రశ్నలు అడిగి, రేపటి మెన్షనింగ్‌లో రండి అని విచారణను సీజేఐ ముగించారు.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 23, 24వ తేదీల్లో తనను విచారించేందుకు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ అనిశా కోర్టు ఈనెల 22న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు పరిష్కరించింది. పోలీసు కస్టడీ ఇప్పటికే ముగిసినందున వ్యాజ్యం నిరర్థకమైనదంటూ విచారణను మూసివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె శ్రీనివాస రెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు.