TDP PAC: టీడీపీ పీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కమిటీ నియామకం తర్వాత తొలిసారిగా భేటీ అయ్యింది టీడీపీ పీఏసీ.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపై చర్చించారు.. గత కొన్ని రోజులు నుంచి కోర్టుల్లో జరుగుతున్న పరిణామాలు.. తాజాగా లోకేష్‌పై కేసు నమోదు వంటి అంశాలపై సమీక్ష జరిగింది.. క్షేత్ర స్థాయిలో రూపొందించుకోవాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది పీఏసీ.. జనసేనతో సమన్వయం కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన వ్యవస్థపై సమాలోచనలు చేశారు.. పీఏసీ భేటీకి యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, బీదా, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరు కాగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు నారా లోకేష్..
ఇక, టీడీపీ పీఏసీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంపై పోరాడేందుకు టీడీపీ-జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేస్తాం.. దీనిపై జనసేనతోనూ కో-ఆర్డినేట్ చేసుకుంటామని తెలిపారు. అక్రమ కేసులతో చంద్రబాబు అరెస్ట్ చేసినా ప్రభుత్వం వైపు నుంచి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించారు.
నారా లోకేష్‌కు సంబంధం లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటూ కేసు నమోదు చేశారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.. ఇన్నర్ రింగ్ రోడ్ లేదు.. భూ సేకరణ కూడా జరగలేదు.. కానీ, అస్సలేం లేని చోట ఏదో జరిగిందని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం తప్పు చేశారు.. ఏం ఆధారాలున్నాయో చెప్పండంటూ కేసులు పెట్టిన వారే చంద్రబాబును అడుగుతున్నారని దుయ్యబట్టారు. ఇక, ఈ నెల 29వ తేదీ రాత్రి 08:15 గంటల నుంచి యువగళం పాదయాత్ర తిరిగి కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామని.. పాదయాత్ర ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచే తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుందని ప్రకటించారు. మాపై కేసులు వేసి.. ఓటర్ల జాబితాలో వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు.. అన్ని స్థాయిల్లో ఓటర్ జాబితా వెరిఫికేషన్ చేపడతామని వెల్లడించారు అచ్చెన్నాయుడు.