Leading News Portal in Telugu

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై జీవీఎల్‌ కీలక ప్రకటన..


Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతూ పోయినట్టు కొన్ని పరిణామాలు చూస్తే అర్థమైంది.. అయితే, ఈ వ్యవహారంలో కీలక ప్రకటన చేశారు భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై యథాతథ స్థితి కొనసాగించే విధంగా కేంద్రం సంకేతాలు పంపించిందన్నారు.. ఎన్నికల ముందు కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశం వ్యతిరేకతను తీసుకుని రాకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ఉక్కు శాఖ సహాయమంత్రి కులస్తే స్టీల్ ప్లాంట్ సందర్శించాల్సి ఉందన్నారు. యజామాన్యం, కార్మిక సంఘాలతో వేరు వేరుగా సమావేశమై కేంద్రం నిర్ణయం వెల్లడించాలని భావించారు. అయితే పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన రద్దు అయ్యిందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు ఎంపీ జీవీఎల్.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసిన ఎంపీ జీవీఎల్…స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. విశాఖ ఉక్కు పబ్లిక్ సెక్టార్ లో కొనసాగాలంటే లాభాల బాట పట్టించాలన్నారు.. ప్రజల ఆస్తిగా ఉన్న పరిశ్రమ పరిరక్షణ అందరి బాధ్యతగా పేర్కొన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ నష్టాలు., ఐరన్ ఓర్ మైనింగ్ ఇవ్వకపోవడం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందా..? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని కార్మిక సంఘాలను కోరుతున్నాం.. కాంగ్రెస్ హయాంలో గత మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్-3ని ప్రారంభిస్తాం.. రాయబరేలిలో ఉన్న రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ ద్వారా 2 వేల కోట్ల మూలధనం సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. NMDC ఆధ్వర్యంలో పిల్లేట్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.