రాష్ట్రంలో ఆడబిడ్డలపై కొనసాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసింది పాలక పక్షం.. మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా?.. చిత్తూరు జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కిరాతకంగా హత్యకు గురైతే ముఖ్యమంత్రి జగన్ గానీ, హోంశాఖ మంత్రి తానేటి వనిత గానీ, మహిళా కమిషన్ ఛైర్మన్ గానీ ఎందుకు స్పందించటం లేదు? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు దురాగతం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ బాలిక తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. విజయనగరం జిల్లాలో తుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా కలిచి వేసింది.. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటే రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ, శాంతి భద్రతల పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరువైంది అనే మాట వాస్తవం.. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసులు చేతులను పాలక పక్షం కట్టేస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో దిశ చట్టాలు చేశాం.. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం అనే పాలకుల ప్రకటనలు ఏ మాత్రం రక్షణ ఇవ్వడం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.