చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 29కి వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు వినిపించాడు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని లూథ్రా వాదించారు. ఇవాళ ( బుధవారం ) సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసుకోవచ్చని శ్రీరామ్ అన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, గోల్కొండలో అత్యధికంగా 94 మి.మీ, శివరాంపల్లెలో 72.8 మి.మీ, జూబ్లీహిల్స్‌లో 61.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మెహదీపట్నం, రాజేంద్రనగర్, బంజారాహిల్స్, అత్తాపూర్, కొండాపూర్, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి, బేగంపేట, మాదాపూర్, హైటెక్ సిటీ అల్వాల్, మల్కాజిగిరి సహా నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది.
భారత వాతావరణ విభాగం (IMD) – హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కూడా బుధవారం భారీ వర్షం కురిసింది. రానున్న మూడు రోజుల పాటు చాలా జిల్లాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్రం మొత్తానికి ఇదే సూచన కనిపిస్తోంది. సెప్టెంబర్ 30 వరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
మోడీ సభకు 1.5 లక్షల మంది.. ఏర్పాట్లు చేస్తున్నాం..
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారవడం, ఆయన ప్రయాణ ప్రణాళిక వెల్లడి కావడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ వివరాలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడిస్తూ.. ‘‘మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారని.. సభ జరిగే భూత్‌పూర్ మైదానానికి 1.5 లక్షల మంది హాజరవుతారని ఆశిస్తున్నామని.. ప్రస్తుతం వివిధ ప్రారంభోత్సవం జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలియజేయలేదు. రైల్వే లైన్లు, జాతీయ రహదారుల డబ్లింగ్ జరిగింది. జిల్లాలో భారత్ మాల పనులు జరుగుతున్నాయి. సోమశిల మీద వంతెనకు శంకుస్థాపన చేయవచ్చు. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తే హైదరాబాద్-తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం వాటి మధ్య దూరం 580 కి.మీ. సోమశిల-సిద్దేశ్వరం కేబుల్ స్టే కమ్ సస్పెన్షన్ వంతెన రెండు దశాబ్దాల నాటి డిమాండ్.
ముత్తయ్య మురళీధరన్ కి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా?
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా 800 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు మీడియాతో ఆయన ముచ్చటించిన క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. మీరు తెలుగు సినిమాలు చూస్తారా? అని అడిగితే శ్రీలంకలో తెలుగు సినిమాలు విడుదల కావు కానీ తమిళ, హిందీ సినిమాలు విడుదల అవుతాయని అన్నారు. తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తామని పేర్కొన్న ఆయన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. హిందీ, తమిళ భాషల్లో కూడా ఆ సినిమాలు విడుదల చేశారని, అవి చూశామని అన్నారు. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్న ఆయన ముఖ్యంగా శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్ అని అన్నారు.
ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్స్ దోస్తీపై ఎన్‌ఐఏ నజర్.. 6 రాష్టాల్లోని 51 ప్రాంతాల్లో దాడులు
భారతదేశంలోని క్రిమినల్ సిండికేట్‌లు, ఖలిస్థానీ వేర్పాటువాదులు, పాకిస్తాన్, కెనడా వంటి దేశాలలో ఉన్న ఉగ్రవాదుల మధ్య అనుబంధంపై ఎన్‌ఐఏ పలు రాష్ట్రాల్లో అణిచివేతను ప్రారంభించింది. దేశంలో ఖలిస్థానీలు, గ్యాంగ్‌స్టర్ల మధ్య సంబంధాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. ఖలిస్థానీలు ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు ఈ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్‌ఐఏ ఏజెన్సీ లారెన్స్ బిష్ణోయ్, అర్ష్‌దీప్ దల్లా నడుపుతున్న ముఠాలకు సంబంధించిన 50 స్థానాలపై దాడి చేసింది. కొందరు గ్యాంగ్‌స్టర్స్ పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబాతో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు భావిస్తున్నారు.
దంచి కొట్టిన ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్
రాజ్ కోట్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మూడో వన్డే కొనసాగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. జట్టుకు ఆసీస్ ఓపెనర్లు శుభారంభం అందించారు. డేవిడ్ వార్నర్ ( 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు) వరుసగా మూడో వన్డేలో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక, హాఫ్ సెంచరీ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కి 137 రన్స్ భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. మిచెల్ మార్ష్ ( 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు ) సెంచరీకి 4 పరుగుల దూరంలో పెవిలియన్ కు చేరుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ట్రై చేసి ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి మార్ష్ డగౌట్ కి చేరాడు.
ఐన్‌స్టీన్ సంతకంతో కూడిన ప్రతులకు వేలంలో భారీ ధర..
ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సంతకంతో ఉన్న ప్రసిద్ధ రచనలకు భారీ ధర పలికింది. సాపేక్ష సిద్ధాంతం(1905), జనరల్ రిలేటివిటీ(1915) సిద్ధాంతాల అభివృద్ధిని వివరిస్తూ రాసిన అరుదైన ఆటోగ్రాఫ్ మాన్యుస్క్రిప్ట్ వేలంలో రూ.10.7 కోట్ల భారీ ధర దక్కించుకుంది. ఇటీవల జరిగిన ‘20/21 సెంచరీ ఆర్ట్ ఈవినింగ్ సేల్’పేరుతో సెప్టెంబర్ 23న వాల్డోర్ఫ్ ఆస్టోరియా షాంఘైలో ఈ వేలం జరిగింది. ఫిబ్రవరి 3, 1929న న్యూయార్క్ టైమ్స్ స్పెషల్ సప్లిమెంట్ లో జర్మన్ భాషలో రాయబడిని ఈ ప్రతులను తొలిసారిగా ప్రచురించబడింది. ఐన్ స్టీన్ తన ప్రముఖమైన ఈ రెండు సిద్ధాంతాల అభివృద్ధిని వివరించేందుకు తన సంతకంతో ఈ ప్రతులను రాశాడు. దీంతో ఈ అరుదైన ప్రతులకు వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది.
రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
భారతదేశంలో వృద్ధుల జనాభా అపూర్వమైన రేటుతో విస్తరిస్తోంది. శతాబ్దపు మధ్య నాటికి పిల్లల జనాభాను అధిగమిస్తుందని కొత్త యూఎన్‌ఎఫ్‌పీఏ నివేదిక పేర్కొంది,. రాబోయే దశాబ్దాల్లో యువ భారతదేశం వేగంగా వృద్ధాప్య సమాజంగా మారుతుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక యుక్తవయస్కులు, యువకులు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. జాతీయ స్థాయిలో యూఎన్‌ఎఫ్‌పీఏ ‘ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023’ ప్రకారం.. వృద్ధుల (60+ సంవత్సరాలు) జనాభా వాటా 2021లో 10.1 శాతం నుండి 2036లో 15 శాతానికి, 2050లో 20.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేయబడింది.
వరల్డ్ కప్ జట్టులోకి అశ్విన్ ఇన్.. అక్షర్ ఔట్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు వన్డే ప్రపంచకప్-2023లో ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్ జట్టులోకి వచ్చే మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు.. కాగా, ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడి ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ.. రాజ్‌కోట్ వన్డేకు అందుబాటులోకి వస్తాడనుకుంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
కరెంట్ షాక్ తో గిలగిల్లాడిన బాలుడు.. కాపాడిన వృద్ధుడు
కరెంట్ షాక్ కొట్టి విలవిల్లాడుతున్న ఓ బాలుడి ప్రాణాలను ఓ ముసలాయన చాకచక్యంగా కాపాడాడు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసిలో నివసిస్తున్న ఓ బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెంటు సరఫరా అవుతున్న వైరు నేలపై ఉన్న నీటిలో పడటంతో సదరు బాలుడికి షాక్ తగిలింది. ఇది గమనించిన వాహనదారులు తమ వాహనాలు ఆపివేశారు. అదే టైంలో బాలుడ్ని కాపాడటానికి ట్రై చేశారు. అదే సమయంలో ఓ వృద్ధుడు కర్రను తీసుకొచ్చాడు. దానిని పట్టుకోవాలని ఆ బాలుడికి సూచించాడు. బాలుడు బాధను దిగమింగుతూ కర్రను పట్టుకుని కరెంటు సరఫరా అవుతున్న వైరును వదిలించుకునేందుకు ట్రై చేశాడు. అయితే, ఆ వృద్ధుడు బాలుడ్ని మరో పక్కకు లాగే సరికి కరెంట్ షాక్ నుంచి తప్పించుకున్నాడు. సదరు ముసలాయన సాహసానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నా పేరు మీద సొంతిల్లు లేదు కానీ.. గుజరాత్‌లో ప్రధాని మోడీ
తన పేరు మీద ఇల్లు లేదు కానీ.. తమ ప్రభుత్వం దేశంలో లక్షలాది మంది ఆడపిల్లలను ఇంటి యజమానులను చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. చోటాఉదయ్‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గిరిజనులు అధికంగా ఉండే బోడేలి పట్టణంలో విద్యా రంగానికి సంబంధించిన రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులతో సహా రూ.5,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఆసీస్ ప్లేయర్లను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ
గత కొన్ని నెలలుగా భారత జట్టు ఎక్కడికి వెళ్లినా వరుణుడు వెల్ కమ్ చెప్పాడు. అయితే ఆసీస్ తో మొహాలీలో జరిగిన మొదటి వన్డేలో మాత్రం వేడి తట్టుకోలేక టీమిండియా బౌలర్లు, శార్దూల్ ఠాకూర్‌తో పాటు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక, మొహాలీలో పిచ్ బౌలర్లకు సహకరించడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే, రాజ్‌కోట్‌లో మాత్రం సీన్ మారింది. బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలించే రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులో కుదురుకుపోయి ఆడారు. మిచెల్ మార్ష్ 96 రన్స్ చేయగా స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
చంద్రబాబు దోషి కనుకనే అరెస్టు అయ్యారు..
చంద్రబాబు దోషి కనుకనే అరెస్టు అయ్యారు.. హెరిటేజీ తో పేదల భూములు లాక్కున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కోట్లకు కక్కూర్తి పడ్డారు.. లింగమనేని, నారాయణ భూముల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే ఇన్నర్ రింగ్.. ఎందుకు లోకేష్ ఢిల్లీలో ఛానెళ్ళ వెంటపడి తిరుగుతున్నాడు అని ఆయన పేర్కొన్నారు. అవినీతి చేసిన వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తారు.. రాష్ట్రం 70 శాతం పట్టణ ప్రాతాలుగా మారనుంది.. స్వచ్ఛ సర్వేక్షణ్ నినాదంతో సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు.. విజయవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు.. కాలువలు ఇరువైపులా సుందరీకరణ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
రోహిత్ శర్మ ఖాతాలో ప్రపంచ రికార్డు
టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) కొట్టిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ అయ్యేలోపే హిట్ మ్యాన్ 5 సిక్సర్లు కొట్టి.. న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ (256) పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా నిలిచాడు.
లష్కరేతోయిబా, దావూద్‌తో ఖలిస్తాన్ లింకులు..
భారతదేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రాడికల్ సిక్కులు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఇతను కూడా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)పేరుతో ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు. కెనడాలో సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇతడిని కాల్చి చంపారు. అయితే ఖలిస్తాన్ ఉగ్రసంస్థలకు, వేర్పాటువాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం చేస్తుందని ఎప్పటి నుంతో తెలుసు.
ఈ నెల 29న ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్..
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొనగా.. ఈనెల 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గణేష్ నిమజ్జనం కారణంగా బందోబస్తు ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు చెప్పడంతో.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెడీ అయింది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఐటీసీ కాకతీయ హోటల్ లో కివీస్ జట్టు ఉండగా.. ఇక పాకిస్థాన్ జట్టు సైతం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి పార్క్ హయత్ కు చేరుకుంది. తాజ్ కృష్ణలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్.. శంషాబాద్ నోవొటెల్ హోటల్ లో శ్రీలంక జట్టు ఉండనుంది.