Leading News Portal in Telugu

GPS Bill: అసెంబ్లీ ముందుకు జీపీఎస్‌ బిల్లు.. బిల్లులో కీలక అంశాలు


GPS Bill: జీపీఎస్ బిల్లును చివరి రోజు శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ముందస్తుగా అజెండాలో పెట్టకుండానే నేరుగా అసెంబ్లీ ముందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది.. జీపీఎస్ ను సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న విషయం విదితమే కాగా.. జీపీఎస్ బిల్లును ప్రవేశపెట్టి.. సభలో మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. బిల్లులోని కీలక అంశాలను పరిశీలించినట్లు అయితే.. రిటైర్ అయ్యే నాటికి ఉన్న బేసిక్ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్ ఇవ్వనున్నారు.. పెన్షన్ దారు మరణిస్తే భార్య లేదా భర్తకు పింఛన్‌లో 60 శాతం గ్యారెంటీ పొందుపర్చారు. ద్రవ్యోల్బణం ప్రకారం సర్దుబాటు చేసిన డీఏగా లాస్ట్ డ్రా బేసిక్ పేపై జీవన వ్యయ సర్దుబాటు చేస్తారు. ఉద్యోగి వార్షిక ఆదాయంలో తగ్గుదల ఉన్నా నెలకు 10 వేలు కనీస పింఛను భరోసా ఇవ్వబోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం వర్తింప జేస్తారు.

ఇక, జీపీఎస్ పథకం వర్తించాలంటే బిల్లు ప్రకారం ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు ఓసారి పరిశీలిస్తే.. వాలంటీర్ రిటైర్మెంట్ అయితే కనీసం 20 ఏళ్లు సర్వీస్ చేసి ఉండాలి.. సర్వీస్ మధ్యలో రాజీనామా చేస్తే పథకం వర్తించదు.. క్రమశిక్షణా చర్యలు, బర్తరఫ్ లాంటి సందర్భాల్లో పథకం వర్తించదు.. ఇక, జీపీఎస్‌తో ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఆశా వర్కర్లకు గతంలో రూ. 3వేలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ. 10వేలకు పెంచాం.. 108 డ్రైవర్లకు జీతాలు పెంచాం.. హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చాం అన్నారు..

మరోవైపు.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ.. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచామని గుర్తుచేశారు. 2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్‌ చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం.. విలీనంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం చేకూరిందని ఈ సందర్భంగా అసెంబ్లీలో వెల్లడించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.