Leading News Portal in Telugu

Organ Donation: తాను మరణించి ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు


Organ Donation: తాను మరణించినా అవయవదానం ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు ఓ యువకుడు.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల లోని హాస్పిటల్స్ కు తరలించారు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ అనే యువకుడి అవయవాలను గ్రీన్ ఛానల్ తో పాటు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలించారు. తీవ్ర దుఖంలో కూడా ఇతరులకు సాయం చేయాలన్న ఆలోచనతో కృష్ణ కుటుంబసభ్యులు అవయవదానం చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా కృష్ణ.. ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఈనెల 23న చిలకలూరిపేట సమీపంలో ట్రావెల్ బస్సు వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ పేషెంట్ గా మారాడు కృష్ణ. అతను తిరిగి కోలుకోవదం కష్టమని డాక్టర్లు చెప్పారు. అతని అవయవాలను దానం చేస్తే మరో ఆరుగురి జీవితంలో వెలుగు వస్తుందని సూచించడంతో.. కృష్ణ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు అతని కుటుంబ సభ్యులు. దీంతో గుంటూరు రమేష్ హాస్పటల్ నుంచి ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.. గ్రీన్ ఛానల్ ద్వారా కిడ్నీలు, కాలేయం తరలించగా, గుండెను ప్రత్యేక హెలికాఫ్టర్ లో తిరుపతి పద్మావతి హాస్పిటల్ కు తరలించారు వైద్యులు. టీటీడీ పద్మావతి ఆస్పత్రిలో 33 ఏళ్ల వ్యక్తికి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు.

తమకు కలిగిన ముగ్గురి సంతానంలో మొదటివాడైన కృష్ణ మరణాన్ని తల్లిదండ్రులు రాజు, మల్లేశ్వరి జీర్ణించుకోలేక పోయారు. అనంతరం తమ బిడ్డ దూరమైనా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి తమ కుమారుడి అవయ వదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మొత్తంగా కృష్ణ గుండెను తిరుపతికి, కాలేయాన్ని విశాఖపట్నంకు, రెండు కిడ్నీల్లో ఒకటి విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రికి, రెండోది గుంటూరు రమేష్‌ ఆస్పత్రికి, రెండు కళ్లు గుంటూరులోని సుదర్శిని ఆస్పత్రికి తరలించారు.. అవి ఇద్దరికి అమర్చనున్నారు. ఇక, తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో గుండెమార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం సుమారు 5.10 గంటలపాటు కష్టపడి గుండెమార్పిడి శస్త్రచికిత్సను చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన కృష్ణ గుండెను కర్నూలుకు చెందిన శ్రీనివాసన్‌ అనే వ్యక్తికి అమర్చారు. అయితే, కృష్ణ కుటుంబం అవయవదానం చేసేందుకు.. వాటికి వివిధ ఆస్పత్రులకు తరలించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. గుండె తరలింపునకు తన హెలికాప్టర్‌ను ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఇక, కట్టా కృష్ణ కుటుంబ సభ్యులు నిరుపేదలమైనా.. అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు.