వైసీపీ కేంద్ర కార్యాలయంలో కవికోకిల గుఱ్ఱం జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడకల్లో జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. గుఱ్ఱం జాషువా జంయతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా చేపట్టాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనేక అవమానాలు ఎదుర్కొని ఎదిగిన మహాకావి జాషువా అని ఆయన కొనియాడారు. జాషువా ఆశయాలు, స్ఫూర్తిని జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతరం పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మహానీయుడు జాషువాను ఇవాళ అందరం స్మరించుకుంటున్నామన్నారు. 128వ జయంతి సందర్భంగా గుఱ్ఱం జాషువాకు ఘనంగా నివాళి అర్పించామన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తన కవిత్వం ద్వారా ఎత్తి చూపిన గొప్ప కవి గుర్రం జాషువా అని ఆయన వ్యాఖ్యానించారు. గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి వంటి గొప్ప గ్రంధాలను అన్ని భాషల్లో అనువాదం చేయాల్సిన అవసరం ఉందని, దళిత వర్గాలకు ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి అందరికీ ఆదర్శనీయమన్నారు. జగన్ ప్రభుత్వానికి అందరం అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.