Leading News Portal in Telugu

Pawan Kalyan : స్వామినాథన్ చేసిన కృషిని దేశ రైతాంగం, వ్యవసాయ రంగ నిపుణులు ఎప్పుడూ మరచిపోరు


భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ‘ఎమ్.ఎస్.స్వామినాథన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మన దేశంలో హరిత విప్లవానికి ఆద్యుడైన స్వామినాధన్. పెరుగుతున్న మన దేశ జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను సమకూర్చేందుకు అవసరమైన వంగడాలను తీసుకురావడంలో స్వామినాథన్ చేసిన కృషిని దేశ రైతాంగం, వ్యవసాయ రంగ నిపుణులు ఎప్పుడూ మరచిపోరు. అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పన చేయడం వల్లే ఆ దిశగా ఎన్నో ప్రయోగాలు నేటికీ మన దేశంలో సాగుతున్నాయి.

తన పేరిట ఉన్న రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో పరిశోధనలు చేయడమే కాకుండా వాతావరణ మార్పులపై అధ్యయనాలు చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడ అడవులను సంరక్షిస్తుండడంలో స్వామినాథన్ నేటికీ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన మరణం భారత వ్యవసాయ రంగానికి తీరని లోటు.’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఎంఎస్‌ స్వామి నాథన్‌ చెన్నైలోని తన ఇంట్లోనే ఇవాళ తుదిశ్వాస విడిచారు. భారత దేశ హరిత విప్లప పితామహుడిగా ఆయన్ని పిలుస్తారు. భారత దేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఆయన అవిరళ కృషి చేశారు. ముఖ్యంగా వరి వంగడాల్లో ఎక్కువ దిగుబడి వచ్చే వాటిని సృష్టించారు. దాంతో భారత దేశం ఇతర దేశాలపై ఆహారం కోసం ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయనకు పద్మభూషన్, రామన్ మెగసెసే పురస్కారాలు లభించాయి.