AP High Court dispose Nara Lokesh’s Anticipatory Bail Plea: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరిగింది. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోస్ చేసింది. ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని కోర్టు ఆదేశించింది. అంతేకాదు విచారణకు సహకరించాలని లోకేష్‌ను కూడా ఆదేశించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వ్యవహారంపై గతేడాది నమోదు చేసిన కేసులో ఏ14గా నారా లోకేష్ పేరు చేరుస్తూ.. ఇటీవల విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. దాంతో లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఆ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చి.. విచారణ జరపాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది.
41ఏ ప్రకారం నోటీసులిస్తామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) కోర్టుకు తెలిపారు. ఏజీ ఇచ్చిన మరికొన్ని వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది. అనంతరం నారా లోకేశ్ తరఫు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. అరెస్టు గురించి ఆందోళన లేనందున విచారణ ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. సీఐడీ బృందం కాసేపట్లో లోకేష్‌కి నోటీస్ ఇవ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఐడీ బృందం సిద్దమైంది.