Sajjala Ramakrishna Reddy: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆధాలన్నీ పక్కాగా ఉన్నాయి.. చంద్రబాబే అసలు సూత్రధారి అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. ప్రజలకు సంబంధించిన సమస్యల పై కాదు.. అడ్డంగా దొరికిన దొంగను కాపాడటానికి ఒక ముఠా ప్రయత్నాలు చేస్తుంది.. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ అంటూ విమర్శించారు. మనుషులను నిలువు దోపిడి చేసి మళ్ళీ ఏం చేయలేదని నమ్మించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లు అంటూ మండిపడ్డారు. ఇక, లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు అని దుయ్యబట్టిన ఆయన.. చంద్రబాబు ఎన్నికల సమయంలో రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాడు.. అదేదో చారిత్రక అవసరం అని బిల్డప్ ఇస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, జైలుకు పంపింది ఎవరు? విచారణ చేస్తున్నది ఎవరు?.. రాష్ట్రపతి దగ్గరకు ఎలా వెళతారో అర్ధం కాదు అంటూ ఎద్దేవా చేశారు సజ్జల.. రాజ్యాంగ వ్యవస్థలో భాగం అయిన కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా తప్పని రాష్ట్రపతికి చెప్పగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లు అంటూ సెటైర్లు వేశారు.. దొంగతనం చేసి సానుభూతి కోసం ప్రయత్నించటం ఏంటి? అని నిలదీశారు. ఒకప్పుడు సీబీఐలో పని చేసిన వాళ్ళు కూడా చంద్రబాబు అరెస్టు పై మాట్లాడటం విచిత్రంగా ఉందన్న ఆయన.. ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోతే తర్వాత విచారణలో భాగం కారా? అధికారులుగా పని చేసిన వారు కూడా ఇలా మాట్లాడుతున్నారు.. ఒప్పందం పై సంతకాలు చేసేటప్పుడు కరెంట్ పోయింది అంటారు.. ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుంటారా? ప్రజలు లేని రాజకీయాలకు స్పేస్ ఉండదన్నారు.
మరోవైపు.. సీఎం జగన్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సమావేశంలో రహస్యం ఏం ఉంటుంది? అని నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పెట్టుబడుల గురించి, మర్యాద పూర్వక భేటీనో అయి ఉంటుంది.. ఇంట్లో కాకుండా రోడ్డు మీద కలుస్తారా? అని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు వస్తే చంద్రబాబు చెట్ల కింద, జనాల మధ్య కూర్చుని మాట్లాడే వారా? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.