Leading News Portal in Telugu

Ramakrishna: క్లారిటీతో ఉన్నాం.. మేం టీడీపీతో కలిసి పోటీ చేస్తాం..



Cpi Ramakrishna

Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ మాత్రమే క్లారిటీతో ఉన్నాయి.. మేం తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో పోటీ చేస్తాం అని ప్రకటించారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. వైసీపీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తోంది.. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆరోపించిన ఆయన.. అందుకే తాము వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రకటించారు.. ఇక, గౌతం అదానీకి గ్రీన్ ఛానెల్ వెల్కం చెప్పడం దురదృష్టకరం అన్నారు రామకృష్ణ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 1400 ఎకరాల భూమిని అమ్మడానికి అమిత్ గుప్తాకు అప్పజెప్పారని విమర్శలు గుప్పించారు. 1400 ఎకరాలు దక్కించుకోడానికే సీఎం వైఎస్‌ జగన్‌తో అదానీ భేటీ జరిగిందని ఆరోపించారు..

Read Also: Mystery Box At Vizag: విశాఖ తీరంలో మిస్టరీ బాక్స్‌పై ఉత్కంఠకు తెర.. అసలు అది పెట్టే కాదు..!

మరోవైపు.. కమ్యూనిష్టులు అమ్ముడు పోయారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనడం దురదృష్టం అన్నారు రామకృష్ణ.. సజ్జల మాటలు ఆయన మాస్టర్ చెప్పించిన మాటలుగా భావిస్తున్నాం అన్నారు.. ఇక, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఏనాడూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ ధర్నాల వద్దకు పోలేదని వ్యాఖ్యానించారు.. ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌పై మాట్లాడుతున్న జీవీఎల్‌.. ఎన్నాళ్లూ గాడిదలు కాస్తున్నాడా..? అని నిలదీశారు. మరోవైపు.. స్మార్టు మీటర్లు ఏర్పాటు చేయడానికి కూడా అదానీకి అప్పజెప్పారని విమర్శించారు.. చండీగఢ్ లో 9,000 ఉన్న స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రంలో 30 వేలు ఎలా అయ్యాయి? అని ప్రశ్నించారు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, అదానీ, సీఎం వైఎస్‌ జగన్‌ కలిసే ఇదంతా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, ఏపీలో ఎన్నికల పొత్తులపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది.. తమతో పొత్తుపై బీజేపీయే నిర్ణయం తీసుకోవాలన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయని స్పష్టం చేసిన విషయం విదితమే.. ఇప్పుడు టీడీపీ, జనసేనకు సీపీఐ కూడా తోడైనట్టు అయ్యింది.