Leading News Portal in Telugu

Tirumala: ఈ నెల 28న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత


Tirumala: తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05 గంటల నుంచి 2:22 గంటల మధ్య చంద్ర గ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం కారణంగా 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ సందర్భంగా 28వ తేదీన సహస్రదీపాలంకరణ సేవ, వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

శనివారం 87,081 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం సమకూరినట్టు టీటీడీ ప్రకటించింది. అలాగే, మొత్తం 41,757 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు తెలిపింది. రద్దీ నేపథ్యంలో సర్వదర్శన టోకెన్లను అక్టోబరు 1, 7,8,14, 15 తేదీల్లో నిలిపివేసినట్టు టీటీడీ వెల్లడించింది. ఆదివారం ఉదయం అలిపిరి లింక్ బస్టాండులో తిరుమలకు బస్సులు లేక భక్తుల ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి ఆలయం మొదలుకుని.. మాడవీధులు, లడ్డూ కౌంటర్‌, అన్నప్రసాద భవనాలు భక్తులతో నిండిపోయాయి. గదులకు కూడా దొరకని పరిస్థితి నెలకుంది. గదిని పొందేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. గదులు లభించనివారు ఫుట్‌పాత్‌లపై, కార్యాలయాల ముందు, చెట్ల కింద, షెడ్లలో సేదదీరుతున్నారు. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో రెండు నడక మార్గాలు రద్దీగా మారాయి.