Leading News Portal in Telugu

Pawan Kalyan: కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే.. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే..


Pawan Kalyan: ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్‌ అంటున్నారని.. జగన్‌ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ తాము అండగా ఉంటామన్నారు. 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారని పవన్‌ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం కురుక్షేత్రం జరుగుతోందని.. 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి.. వైసీపీ వాళ్లే కౌరవులు అని పవన్‌ అన్నారు. మెగా డీఎస్సీ అని జగన్ ఇచ్చిన హామీలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా జనసేనాని హామీ ఇచ్చారు. పోలీసులను అండగా పెట్టుకుని.. కిరాయి సైన్యాన్ని చేతిలో పెట్టుకున్న వైసీపీతో పోరాడుతున్నామని పవన్ అన్నారు.

అధికారం కోసం అర్రులు చాచడం లేదన్న పవన్.. ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామన్నారు. అనుక్షణం బెదిరింపులు.. యుద్ద రంగం నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులు వస్తున్నాయన్నారు. స్పెషల్ స్టేటస్ కేటగిరి విషయంలో ప్రధానితో విబేధించానని పవన్ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని ఎలా తీసుకుంటారని తాను చంద్రబాబుతో విబేధించానన్నారు. ప్రజల కోసం నేను మాటిచ్చాను.. దానికి నిలబడ్డానని పవన్‌ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదనే నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను అసెంబ్లీలో ఉండి ఉంటే.. మెగా డీఎస్సీ కోసం ఇలా ఆందోళన చేయాల్సి వచ్చేది కాదన్నారు. జగన్‌కు ఐదేళ్ల కాలం ఎంత విలువైందో తెలియదన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.

ఐదేళ్ల కాలంలో చాలా మంది యువత వయస్సు పెరిగి ఉద్యోగాలకు అర్హత కోల్పోతారని చెప్పుకొచ్చారు. ఓట్లు చీలకుండా ఉండి ఉంటే.. ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. యువతను మోసం చేసిన ప్రభుత్వాన్ని తాను అధికారంలోకి ఉండనివ్వనన్నారు. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే అని పవన్‌ స్పష్టం చేశారు. జగన్ చక్కటి పరిపాలన ఉండుంటే నాలుగో విడత వారాహి యాత్రకు ఇంత స్పందన రాదన్నారు. జగన్ పాలన బాగుండి ఉండుంటే.. నా వారాహి వాహనం రోడ్డేక్కేదే కాదన్నారు.