Leading News Portal in Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్‌



Top Headlines @ 9 Am

*నేడే డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు రెండు దశల్లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. తాజాగా మూడో దశలో రెండు దశల్లో 36 వేల ఇళ్లను ప్రభుత్వం అందించనుంది. తొలిదశలో ఇవాళ (సోమవారం) 19,020 మందికి ఇళ్ల పట్టాలు, ఈ నెల 5న మరో 17,864 మందికి డిగ్నిటీ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి పేదలకు దశలవారీగా పంపిణీ చేస్తోంది. రూ.9,600 కోట్లతో జీహెచ్‌ఎంసీ ప్రధానమైన ప్రాంతాల్లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మించిన ఇళ్లను చాలా పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకతీతంగా ర్యాండమైజేషన్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. మొదటి విడుతలో 11,700 మందికి, రెండో విడుతలో 13,200 మందికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్లు మంజూరు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఇక మూడో విడుతలో 36,884 మందిని ఎంపిక చేశామని, సోమవారం 19,020 మందికి, మిగిలిన వారికి 5న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

*నేడే దళిత బంధు రెండో విడత
ఇవాళ (అక్టోబర్ 2) గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే హ్యాట్రిక్ సక్సెస్ లక్ష్యం. వెనుకబడిన దళితులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి దశలో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం, రెండో విడత పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 162 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నారు. మొదటి విడత పంపిణీలో అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు భారీగా కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

*తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు. గత కొద్ది దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘంలో వెంకటేశ్వర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చి సహకారం అందిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఇక, మరింత సమాచారం కోసం వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు వెళ్లకుండా లోపలే ఉంచారు. ఆయన ఫోన్ డేటాను విశ్లేషించడంతో పాటు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే దానిపై ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న పలు పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు.

*జైలులో చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేశ్ సహా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొననున్నారు. ఇక, చంద్రబాబు జైళ్లోనే ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టనుండగా, ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రి క్యాంప్ ఆఫీసులోనే సత్యమేవ జయతే పేరుతో నిరహార దీక్షకు కూర్చుంటున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేశ్ కూడా అక్కడే ఎంపీ కనకమేడల ఇంట్లో నిరాహార దీక్ష చేయనున్నారు.

*నేడు మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ( సోమవారం ) మచిలీపట్నంలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నంలో మహాత్మాగాంధీకి పవన్ నివాళులర్పించనున్నారు. అనంతరం వారాహి యాత్రలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్న జనసేన అధినేత.. అనంతరం సభలో ఎలాంటి విషయాలను మాట్లాడాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు.

*బండారు సత్యనారాయణమూర్తి ఇంటిని ముట్టడించిన పోలీసులు
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అనకాపల్లిలోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. అటు టీడీపీ శ్రేణులు కూడా బండారు ఇంటి దగ్గరకు చేరుకుంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతోంది. నిన్న (ఆదివారం) రాత్రి పది గంటల తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అటువైపుగా ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. అయితే.. బండారు ఇంటివైపు ఎవరు రాకుండా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

*యూపీలో వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుళ్లు.!
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్‌స్టేషను వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.