Leading News Portal in Telugu

Minister Jogi Ramesh: పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలకు మంత్రి కౌంటర్‌.. నేనే వస్తా.. నీతో పాటే నడుస్తా..!


Minister Jogi Ramesh: పెడనలో తనపై దాళ్ల దాడి జరిగే అవకాశం ఉందంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన ఆరోపణలపై సీరియస్‌గా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెడనలో తన మీద రాళ్ల దాడి జరుగనుందని పవన్ కల్యాణ్‌ అభూత కల్పనలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది పవన్ వైఖరిని దుయ్యబట్టారు. అవనిగడ్డలో పవన్ మీటింగ్ కు ముచ్చటగా 300 మంది వచ్చారు.. టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగిన మొదటి మీటింగ్ అది.. టీడీపీని మళ్లీ మోస్తాను అంటే ప్రజలు అంగీకరించ లేదన్నారు. 2014 ఎన్నికల్లో నువ్వు చెప్పినట్లు టీడీపీకి ఓటు వేస్తే.. అదే లోకేష్ నిన్ను, నీ కుటుంబాన్ని నోటికి వచ్చినట్లు తిట్టారు.. ముఖ్యమంత్రి కావాలంటే మా బ్లడ్ ఎక్కించుకోవాలి అన్నారు.. ప్యాకేజీ రాగానే ఈ మాటలు పవన్ మర్చి పోయి ఉంటాడు.. కానీ, ప్రజలు మర్చిపోలేదు అని వ్యాఖ్యానించారు.

పెడనలో గొడవలు సృష్టించాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్‌ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు జోగి రమేష్‌.. నేనే వస్తా.. నీతో పాటే నడుస్తా.. నేనే స్వయంగా దగ్గర ఉండి పెడన నియోజకవర్గంలో నీ పర్యటన చేయిస్తా.. నీ సభ సక్సెస్ అయ్యేంత వరకు పక్కనే నిలబడతా.. దమ్ము ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్‌ చేశారు. ఫలానా చోట నా మీద దాడికి కుట్ర జరుగుతోందని చూపించు.. పవన్ వ్యాఖ్యలు, ఆరోపణలు నిజం అయితే పోలీసులకు, డీజీపీకి వెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈ కుతంత్రాలు జరుగుతున్నాయన్న ఆయన.. జనసేన అభిమానులు ఇటువంటి మోసగాడిని నమ్మకండి అని సూచించారు. సింగిల్ గా పోటీకి రాలేని పిరికిపందలు.. గుంపులుగా, పందుల్లా వస్తాం అంటారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్‌.