స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశారు.. ఆ పిటిషన్లపై నేడు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో నేడు సీఐడీ విచారణకు రావాలన్న నోటీసులపై తన ఇంటి దగ్గరే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరుగనుంది.
అయితే, చంద్రబాబు కేసుల వ్యవహారంలో.. కోర్టులలో పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై ఎంక్వైరీ జరుగనుంది. మరో అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సీఐడీ తెలిపింది. పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా నేడు ఒకేసారి వాదనలు ఏసీబీ కోర్టులో కొనసాగనున్నాయి.
మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అటు.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో.. చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఇంకోవైపు స్కిల్‌స్కామ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. గతంలో జరిగిన విచారణలో నేటి వరకూ లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు వెల్లడించింది. దీంతో విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో నేడు మరోసారు కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగుతాయి.