Leading News Portal in Telugu

CM Jagan: ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించనున్న సీఎం జగన్


ఏపీ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడబోతుంది. ఇవాళ ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే.. 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఏడు ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజతో పాటు మరో ఆరు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

ఇక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం జగన్ చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు కార్యక్రమం జరుగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుండగా.. పరోక్షం 90,700 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులను జగన్ ఓపెనింగ్ చేయనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం దగ్గర రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్‌ ఇండియా, బాపట్ల జిల్లా కొరిసిపాడు దగ్గర శ్రావణి బయో ఫ్యూయల్‌ రూ.225 కోట్లు, తిరుపతిలోని నాయుడుపేటలో 800 కోట్ల రూపాయలతో గ్రీన్‌లామ్‌ సౌత్, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 200 కోట్ల రూపాయలతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి దగ్గర 150 కోట్ల రూపాయలతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి దగ్గర 125 కోట్ల రూపాయలతో యునైటెడ్‌ ఇండస్ట్రీస్‌ ఆటో ప్లాస్టిక్, మడకశిర వద్ద 250 కోట్ల రూపాయలతో ఎవరెస్ట్‌ స్టీల్‌ బిల్డింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.