ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలనేది జగన్ తాపత్రయం.. అందుకే హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు బీజేపీకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది దేవుడికే తెలియాలి.. చంద్రబాబు అరెస్టు అక్రమమని తెలిసి కూడా బీజేపీ నేతలు కనీసం స్పందించకపోవటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది అని అచ్చెన్నాయుడు అన్నారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తాం.. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
వామపక్ష పార్టీలతో పొత్తు అంశం అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారు అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని భావిస్తున్నాం.. బాబుతో నేను ఇంటింటి ప్రచారం, రిలే దీక్షలు ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగుతాయన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే ప్రక్రియ ఇంకా ఆలస్యమైతే.. 10వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై దాదాపు 120 మంది చనిపోయారు.. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని నారా భువనేశ్వరి ఇప్పటికే నిర్ణయించారు అని అచ్చెన్నాయుడు అన్నారు.
నారా భువనేశ్వరితో పాటు పార్టీ నేతలు వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను కోర్టు పరిణామాలు బట్టి 10వ తేదీన నిర్ణయిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. నారా లోకేష్ కూడా ఈ వారంలో చంద్రబాబుతో ములాకత్ అవుతారు.. చంద్రబాబు అరెస్టుతో పార్టీ కార్యక్రమాలు ఏవీ స్తంభించ లేదు.. ఓట్ల అక్రమాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ కి సంబంధం లేదని నిన్న ( మంగళవారం ) న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడేమంటారు?.. నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం అనేది బహిర్గతమైంది అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది అనేది స్పష్టమైందన్నారు.