Minister Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర, టీడీపీ-జనసేన పొత్తు, పెడనలో వారాహి యాత్ర బహిరంగ సభపై సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్.. పెడనలో అటెన్షన్ కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం.. సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్లతో దాడులు అని హడావిడి చేశాడు.. రెండు వేల మందితో దాడులు అన్నాడు.. కానీ, పవన్ సభకు రెండు వేల మంది కూడా రాలేదని విమర్శించారు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని దుయ్యబట్టారు. ఇక, జనసేన – టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. చంద్రబాబు స్కిల్ స్కాంలో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు.. జైల్లో ఉన్న దత్త తండ్రి కోసం పవన్ పాకులాడుతున్నాడని మండిపడ్డారు.
పెడన ప్రజలు శాంతి కాముకులు.. అటువంటి ప్రజలపై ఆరోపణలు చేసినందుకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జోగి రమేష్.. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కల్యాణ్‌ది అని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ బ్లడ్ ఎక్కించుకున్నావా? ప్యాకేజీ వచ్చిందని బ్లడ్ ఎక్కించుకున్నావా? అంటూ ఎద్దేవా చేశారు. నీకు లాగా కాపు సామాజికవర్గం అమ్ముడు పోదు.. రంగాను చంపిన వాళ్ళ పల్లకి మోస్తావా? అని నిలదీశారు. పవన్ ను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మబోరన్న ఆయన.. పవన్ కల్యాణ్ పావలా.. పావలాలు పంచుకునే పావలాగాళ్లు మీరంతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి ఖర్మ పట్టింది.. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని ఎద్దావే చేశారు జోగి రమేష్.. పవన్ కల్యాణ్ భారతీయుడో, రష్యా వాడో తెలియదు.. భారతీయులు, ఆంధ్రవాళ్లకు పాస్ పోర్ట్ అక్కర లేదు.. రష్యా వాడికి మాత్రం పాస్ పోర్ట్ కావాల్సిందే అని సెటైర్లు వేశారు. ఈ పెత్తందార్లు అంతా వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కానున్నారని వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.