విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు. రైతు ఉద్యమం తరహాలో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలపై వెనక్కి తగ్గడం ఖాయం.. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే మోడీని అధికారానికి దూరం చేయాలిసిందే.. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉంటే కేంద్రం మాత్రం తప్పుడు ప్రచారాలు చేసుకుంటోంది అని సీతారం ఏచూరి అన్నారు.
ప్రచారాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మోడీ.. రైతుల రుణమాఫీకి మాత్రం ముందుకు రాడు అని సీతారం ఏచూరి అన్నారు. 2024లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాపాడుకోవడానికి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.. ఇండియా కూటమి తరపున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యతను మార్కిస్ట్ పార్టీ తీసుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. 28 భాగస్వామ్య పార్టీల మద్దతు కూడ గట్టి విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం కోసం కృషి జరుగుతుంది.. రైతాంగం ఉద్యమం తరహాలో ఉక్కుపోరాటం నిరంతరాయంగా, ధృఢంగా కొనసాగాలి.. ఇండియా కూటమి తరపున విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తోంది.. విశాఖ ఉక్కు-మన హక్కు నినాదంతో పోరాటం కొనసాగించాలి అని సీతారం ఏచూరి చెప్పుకొచ్చారు.