ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాలు రాయలసీమకి శాపాలుగా మారుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ చేసిన నేరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయి.. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నాడు అని ఆయన విమర్శించారు. రుషికొండ గుండు కొట్టిన కేసు తప్పించుకునేందుకు విశాఖ రైల్వే జోన్ కి నీళ్లొదిలాడు అంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబాయ్ ని చంపించేసిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేశాడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాయలసీమ బిడ్డనంటూ క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్నాడు అని ఆయన మండిపడ్డాడు. జగన్ సర్కారు దారుణ వైఫల్యం వల్లే కృష్ణాజలాల కేటాయింపులు పునఃసమీక్ష జరుగుతోంది అని విమర్శించారు. ప్రజలారా జగన్ కి ఇచ్చిన ఒక్క అవకాశంతో ఏమేమి కోల్పోయారో గుర్తించండి.. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణాజలాలలో న్యాయబద్దమైన వాటా కోల్పోతే, రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది.. చంద్రబాబును అరెస్ట్ చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని నారా లోకేశ్ తెలిపారు.