ఏపీలో విష సంస్కృతి పెరిగిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. పదేళ్లుగా ఈ తరహా తిట్లు రాజకీయాల్లో పెరిగాయని, ఇటువంటి వ్యాఖ్యలను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు సాధినేని యామిని. ప్రజలకు తాగు నీరు కూడా అందించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని, మురుగు నీరందిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. బాలికల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని, కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఏపీకి కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం నిధులను సద్వినియోగం చేయడం లేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. అనేక జిల్లాల్లో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. జగన్ మామా అంటూ ప్రకటనలు ఇప్పించుకుంటారు. రేపు వారికి ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తారా..? జల జీవన్ మిషన్ డాష్ బోర్డు లో మాత్రం అంతా గొప్పగా చూపిస్తారు. అంటే కేంద్రాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడకు ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. విద్యార్థులు కోసం ఇచ్చిన నిధులు కూడా మళ్లించడం దుర్మార్గం. వీటి పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. వివరాలు వెల్లడించాలి. ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంతో పని చేస్తున్నారు. వైసీపీ నాయకులు చెప్పిన విధంగా చేస్తూ అధికారులు కూడా తప్పుడు నివేదికలను పంపుతారా..? ఏపీలో మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగి పోయాయి.
ఏపీలో మద్యం, గంజాయితో యువత మత్తులో చిత్తు అవుతుంది. మహిళల పుస్తెలు తెగడానికి, యువత పెడదోవ పట్టడానికి జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణం. రాష్ట్రంలో పరిశ్రమలు రావు.. ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయి. ఈ ప్రభుత్వానికి పరిశ్రమలు తీసుకు రావడం చేతకాదు. రాష్ట్రంలో వైసీపీ పాలన చాలా దారుణంగా ఉంది. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళతాం. రాష్ట్రంలో మహిళల ఉసురు పోసుకుంటున్నారు. నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో స్థలం ఇచ్చి వసతులు కల్పించలేదు. విద్యా సంస్థలకు కేటాయించిన నిధులు వాళ్లకే వాడాలి. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేసి జగన్ మాట నిలబెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం. వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.’ అని సాధినేని యామిని వ్యాఖ్యానించారు.