Leading News Portal in Telugu

Nara Lokesh : నేడు ఢిల్లీ వెళ్లనున్న నారా లోకేష్‌


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 20 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన లోకేష్ గత రెండు రోజుల క్రితం ఏపీ వచ్చారు. అయితే.. నిన్న రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్‌ అయిన లోకేష్‌ నేడు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు నేపథ్యంలో నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే.. నిన్న స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. అప్పటిలోపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమ ముందు పెట్టాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్కిల్‌ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు 2018లోనే ప్రారంభమైనట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు హైకోర్టు తీర్పులో లేవన్న సుప్రీంకోర్టు, అందుకు సంబంధించిన స్పష్టత కావాలని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం 17A వచ్చిన తర్వాతే ఈ కేసులో FIR నమోదైందని సర్వోన్నత ధర్మాసనం అభిప్రాయపడింది.