Leading News Portal in Telugu

Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు సీఐడీ విచారణకు నారా లోకేశ్


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఉదయం 10 గంటలకు సీఐడీ ఆఫీస్ లో విచారణకు హాజరుకానున్నారు. IRR allignment మార్పు కేసులో లోకేశ్ ను A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో ఫైల్ చేశారు. అయితే, ఇప్పటికే నారా లోకేశ్ కు CRPCలోని సెక్షన్ 41ఏ క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఏపీ హైకోర్ట్‌కు సీఐడీ తెలిపింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన తొలుత లోకేశ్ ను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్స్ వివరాలు తీసుకురావాలని సీఐడీ అధికారులు వెల్లడించారు.

అయితే, హెరిటెజ్ బోర్డు తీర్మానాలు, అకౌంట్స్ వివరాలను తీసుకురావాలనే ఈ నిబంధనలను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్ట్‌కు నారా లోకేశ్ వెళ్లారు. ఇరువురి వాదనల అనంతరం లోకేశ్ ను అకౌంట్ వివరాల కోసం చేయొవద్దని ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే, రేపు (మంగళవారం ) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాయర్ల సమక్షంలో విచారణ చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు నారా లోకేశ్ తప్పకుండా విచారణకు హాజరు కావాలని కోర్ట్ తెలిపింది.

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు నారా లోకేశ్ సీఐడీ అధికారుల ముందు విచారణకు రానున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి విజయవాడకి లోకేశ్ చేరుకున్నారు. లోకేశ్ విచారణకు హాజరు అవుతుండటంతో తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. లోకేశ్ విచారణకు వస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తారని పోలీస్‌లు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.