Leading News Portal in Telugu

Electric Buses: విశాఖకు ఎలక్ట్రిక్‌ బస్సులు.. తొలివిడతలో 100 బస్సులు


Electric Buses: ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే.. త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా పాలన సాగించేందుకు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏర్పాట్లలో అధికార యంత్రం నిమగ్నమై ఉంది.. విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నా.. మూడు రాజధానుల వైపు ముందుకు సాగిన సీఎం వైఎస్‌ జగన్‌.. దసరా నుంచి వైజాగ్‌ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు.. ఇదే సమయంలో.. విశాఖ అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాగంగా త్వరలో విశాఖ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.. మూడు నెలల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్లపైకి వస్తాయని చెబుతున్నారు అధికారులు.. తొలివిడతలో 100 ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోన్న ఏపీఎస్ఆర్టీసీ.. మలి విడతలో మరో 100 బస్సులు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది.. అయితే, సిటీ సర్వీసులుగానే ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. వీటికోసం సింహపురి, గాజువాక డిపోలు ఎంపిక చేసింది ఏపీఎస్ ఆర్టీసీ.

కాగా, ఏపీలో ఇప్పటికే తిరుపతి నుంచి కొండపైకి విద్యుత్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే నెల్లూరు–తిరుపతి మధ్య కూడా ఇవి నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా పెద్ద నగరాల్లోనూ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు కొన్నాళ్లుగా సన్నాహాలు జరుగుతుండగా.. అందుకు గాను.. తొలిదశలో వెయ్యి విద్యుత్‌ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు.. అందులో విశాఖ సిటీకి 200 ఎలక్ట్రిక్‌ బస్సులు అవసరమవుతాయని ఆర్టీసీ జిల్లా అధికారులు.. ఆర్టీసీ యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో.. త్వరలోనే విశాఖ రోడ్లపై ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులు పెట్టనున్నాయి..