
Chandrababu Cases: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును ఇవాళ వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ-1గా ఉన్నారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లపై కేసు నమోదైంది. మొత్తం 179 మంది నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్ వచ్చింది. ఇక ఈ కేసులో ఏ-1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది.
మరోవైపు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోసు, జస్టిస్ బేల.ఎమ్.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతాయి. మంగళవారం సెక్షన్ 17ఏ చుట్టూ వాడివేడిగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. మొత్తంగా ఇటు హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది.. అటు.. సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు సాగనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.