Leading News Portal in Telugu

Uttarandhra and Rayalaseema: ఉత్తరాంధ్ర, రాయలసీమపై ప్రభుత్వం కీలక నిర్ణయం


Uttarandhra and Rayalaseema: ఉత్తరాంధ్ర, రాయలసీమపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Uttarandhra and Rayalaseema: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దసరాకు విశాఖ నుంచి పరిపాలన చేయాలని సంకల్పించిన సీఎం జగన్‌.. ఆ దిశగా కీలక అడుగు వేశారు. మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో ఉండటంతో సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటుపై న్యాయపరమైన చిక్కులు ఎదురు అవ్వచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటిని ఏర్పాటు చేశారు సీఎం. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు, హెచ్‌వోడీలు, ప్రత్యేక అధికారులు ఇక నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సీఎం హామీల అమలును నిరంతరం సమీక్షించనున్నారు. ఆయా జిల్లాల ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించడం, సమీక్షలు చేయడం, తప్పనిసరిగా రాత్రి బస కూడా చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ట్రాన్సిట్‌ అకామిడేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రాన్సిట్ అకామిడేషన్‌ల గుర్తింపు కోసం ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్, సాధారణ పాలన కార్యదర్శులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మరో వైపు నోడల్ ఏజెన్సీగా ప్రణాళికా విభాగాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. జీవో నెంబరు 2004ను సీఎస్ జవహర్ రెడ్డి జారీ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇక కర్నూలు జిల్లాలోని ఆదోని అభివృద్ధి కోసం ఆదోని ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేశారు. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.