Tirumala: తిరుమలలో కొలువుదీరిన కొలిచినవారి కొంగుబంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రత్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది.. రేపటి నుంచి అంటే అక్టోబర్ 15వ తేదీ 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం మాడవీధులలో ఉరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. రేపు ఉదయం బంగారు తిరుచ్చి పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రేపు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీవారు.
ఇక ఇవాళ, రేపు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీచేసే టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఇవాళ నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.. షెడ్యూల్ సమయం కంటే అరగంట ముందుగానే గరుడ వాహన సేర నిర్వహించేలా అంటే.. సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభం కానుంది గరుడ వాహన సేవ.. ఈ నేపథ్యంలో 19వ తేదీన ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలకు అనుమతి నిలిపివేయనున్నారు టీటీడీ అధికారులు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.. నిన్న శ్రీవారిని 59,304 మంది భక్తులు దర్శించుకోగా.. 22,391 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.08 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.