Leading News Portal in Telugu

Chandrababu Health: జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక నివేదిక


Chandrababu Health: జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై  వైద్యుల కీలక నివేదిక

Chandrababu Health: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉన్నట్లుగా తెలిసింది. చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. గడ్డం మీద, అరచేతి‌భాగాల్లో, చాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో హెరిటమతాస్ దొద్దుర్లు, చర్మం రంగుమారినట్లుగా వైద్యుల నివేదికలో తేలింది. కలామన్ లోషన్, అరచేతుల కోసం మార్చురెక్స్ సాఫ్ట్ క్రీమ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం మెకనాజల్ వైద్యులు రిఫర్ చేశారు. అలెర్జీ కోసం టెక్జిన్, ఇమ్యూనిటీ పెంపు కోసం లిమ్సీ ట్యాబ్లెట్స్ రిఫర్ చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వైద్యులు తేల్చారు.

డీహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో స్పష్టంగా సూచించారు. చంద్రబాబుకు హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి (Hyper trophic cardiomyopathy) సమస్య ఉందని వ్యక్తిగత వైద్యులు తెలిపారు. ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్‌తో గుండె పైనా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి చూపిస్తున్న ప్రభుత్వం, అధికారులు చూపిస్తున్నారని వారు చెప్పారు. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.