
Dussehra Holidays 2023: దసరా పండుగ వచ్చేస్తోంది.. రేపటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది.. తెలంగాణలో అతిపెద్ద వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుండడంతో.. ఇవాళ్లి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రేపటి నుంచి అంటే శనివారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఏపీలోని పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. అక్టోబరు 14 తేదీ నుంచి అక్టోబర్ 24 తేదీ వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.. అంటే.. అక్టోబర్ 25వ తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి పాఠశాలలు.. ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ. మొత్తంగా ఏపీలో స్కూళ్లకు 11 రోజుల పాటు దసరా సెలవులు వస్తున్నాయి.
మరోవైపు.. తెలంగాణలో ఇవాళ్టి నుంచే దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి.. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఈ రోజు నడుస్తున్నా.. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం మూతపడ్డాయి.. ఇక, అక్టోబర్ 23, 24 తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు రోజులు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని జీవో జారీ చేసింది. అక్టోబర్ 25వ తేదీని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. స్కూళ్లు తిరిగి 26వ తేదీన తెరుచుకోనున్నాయి.. అంటే ఈ సారి దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు వచ్చాయి.